వేసవిలో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వేసవిలో అప్రమత్తంగా ఉండాలి

Apr 14 2026 7:16 AM | Updated on Apr 14 2026 7:16 AM

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి..

వనపర్తి: జిల్లాలో రానున్న వారం రోజులు భారీగా వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ఎండాకాలం వడగాలులపై సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేశారు. అన్ని పుర, మండల కేంద్రాల్లో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వడగాలులపై అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ వెంట తాగునీటి సీసాను వెంటబెట్టుకొని వెళ్లాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉపాధి పని ప్రదేశాల్లో చల్లని తాగునీరు, నీడ కోసం టెంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా సదుపాయాలు కల్పించలేదని తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా మధ్యాహ్నం వేళలో వ్యవసాయ పనులకు వెళ్లరాదన్నారు. మిషన్‌ భగీరథ అధికారులు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ప్రజలందరికీ సకాలంలో నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎస్పీ బాలాజీనాయక్‌, డీటీఓ మానస, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోషణ్‌ పక్వాడ్‌ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ..

పోషకాహార లోపం నివారణే లక్ష్యంగా ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న పోషణ్‌ పక్వాడ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన పోషకాహారం అవసరమని, వాటిపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని వైద్యశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘనీ, ఆయుష్‌ విభాగం అధికారులు, డీడబ్ల్యూఓ, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, పోషణ్‌ అభియాన్‌ సిబ్బంది, లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయన హాజరై రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్‌ దరఖాస్తులను కూడా పరిశీలించి వారంలోగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 30 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ విఠోబా, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

Advertisement
 
Advertisement
Advertisement