ఖిల్లాఘనపురం: జిల్లాలో పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అక్కడే ఉన్న ఎంఈఓ జయశంకర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పాఠశాలల్లోని పరిస్థితులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 14న ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. ఒకేషనల్, సంస్కృతం మినహా ప్రధాన పరీక్షలు సోమవారంతో ముగిశాయని చెప్పారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఖిల్లాఘనపురంలోని రెండు కేంద్రాలకు 496 మంది విద్యార్థులను కేటాయించగా సోమవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 493 మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం ఒకేషనల్, గురువారం సంస్కృతం పరీక్ష నిర్వహిస్తే మొత్తం పరీక్షలు ముగుస్తాయని డీఈఓ చెప్పారు. ఆయన వెంట కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.


