అనూహ్య మలుపులు
క్లిష్టతరంగా మారిన కుమ్మెర జాతరలో దాడి ఘటన
బహిరంగ చర్చకు సిద్ధం:
ఎంపీ మల్లు రవి
● అనేక మలుపులతో అంతుచిక్కని రహస్యంగా దాడి కేసు
● బాధితులపైనా లోతుగా సాగుతున్న విచారణ
● చివరికి ఎటువైపు దారితీస్తుందోనన్న
అనుమానం
● పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యంపై
విమర్శలు
సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో దాడి ఘటన అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల పోరాటం కొనసాగడంతోపాటు ఉన్నత స్థాయిలో ఎస్సీ, బీసీ కమిషన్లు సైతం విచారణలో భాగమయ్యాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్పందించి నాలుగు వారాల్లో ఘటనపై పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నెల 18న జాతరలో దాడి ఘటన చోటుచేసుకోగా 21న పసిపాప మరణం నుంచి వరుసగా ఏడు రోజులపాటు నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో పోలీసుల నిఘా వైఫల్యంతోపాటు బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఘటన తర్వాత స్పందనపై విమర్శలు..
కుమ్మెర మల్లన్న జాతరలో ఏటా పదివేల మందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రానికి 11 కి.మీ దూరంలో కుమ్మెర ఉండగా.. భారీ సంఖ్యలో పాల్గొనే జాతరలో పోలీసుల బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్టు ఎస్సీ, బీసీ కమిషన్ చైర్మన్లు స్పష్టం చేశారు. దాడి ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఏం జరుగుతుందన్న దానిపై, అసలు నిజాలు తెలుసుకోవడంలో పోలీస్ నిఘా వ్యవస్థ సైతం వైఫల్యం చెందినట్లు విమర్శలు వస్తున్నాయి. దాడి ఘటన చోటుచేసుకున్న తర్వాత బాధితుల పట్ల పోలీసులు చూపిన వైఖరి వివాదాస్పదమైంది.
బాధితులపైనే కేసుతో..
జాతరలో గణేశ్‌ను కొబ్బరికాయల గదిలో తలుపులు వేసి బంధించి 8 మంది వరకు దాడి చేసినట్లు బయటకు వచ్చిన వీడియోల్లోనే స్పష్టమైంది. దాడి ఘటన వెంటనే ముందుగా బాధితుడు గణేశ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీస్‌స్టేషన్ దాకా వచ్చాక ముందుగా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం వివాదానికి దారితీసింది. నిందితుల పట్ల పోలీసులు గౌరవ మర్యాదలతో ప్రవర్తించారని, తమను మాత్రం నిర్లక్ష్యం చేశారని బాధితులు పదేపదే ఆరోపించారు. గణేశ్‌పై దాడి జరిగింది స్పష్టమైనప్పటికీ, నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి గాయాలు అయ్యాయన్న కారణంతో బాధితులపైనే కేసు నమోదు చేయడం ఆగ్రహావేశాలకు దారితీసింది. దాడి ఘటన తర్వాత మూడు రోజులకు ఫిబ్రవరి 21న రెండు నెలల పాప మరణంతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితులు రోడ్డెక్కారు. ప్రజాసంఘాల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదుచేశారని, లేకపోతే మరింత నీరుగార్చేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లోతుగా విచారణ..
కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబంపై దాడి జరగగా ఇది ఆధిపత్య వర్గం నుంచి పోరుగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ క్రమంలో నిందితులపై హత్యకేసు నమోదుచేయాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అయితే పోలీసులు దాడి ఘటనలో పాల్గొన్నవారు ఎవరు.. ఏం జరిగిందన్న దాంతోపాటు బాధితులపైనా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరగా ఏం తేలుతుందోనని, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందోనన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతుండగా.. ఇప్పటి వరకు ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
శుక్రవారం నిజనిర్ధారణ కోసమని కాంగ్రెస్ నేతల బృందం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుమ్మెర ఘటన విషయంలో అవాస్తవాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని, వాస్తవాలను గమనించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పసిపాప మృతిపై రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ముఖ్యనేతలతోపాటు ఆందోళన నిర్వహించిన వారితో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగినట్టు అనిపిస్తే తాను పార్టీని వదిలైనా వారితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.


