న్యాయవాదులకు రక్షణ కరువు
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తిటౌన్: సమాజంలోని పెడ ధోరణులతో న్యాయవాదులకు రక్షణ కరువైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. తమ రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షిదారుడికి న్యాయం చేసేందుకు ముందుకెళ్తే కక్ష్య సాధింపుగా దాడులు చేయడం అవివేకానికి నిదర్శనమన్నారు. యువ న్యాయవాదులు సీనియర్ల సలహాలతో ముందుకెళ్లాలని.. న్యాయవాదులు న్యాయాన్ని గెలిపించేందుకే ప్రయత్నిస్తారని, అలాంటి వారిపై దాడులు చేస్తుంటే ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయకపోవడం ఏంమిటని ప్రశ్నించారు. వృత్తిలో ఈర్శ్య, ధ్వేషాలు వదలి ప్రవీణ్యతతో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వైద్య కళాశాల సందర్శన..
వనపర్తి: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం సందర్శించి విద్యార్థులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి 8 ఎకరాల స్థలం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో మెడికల్ కళాశాల అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మెడికల్, పారా మెడికల్ కోర్సులు, హాస్టళ్లు, పరిశోధన కేంద్రాలు, ఇతర మౌలిక వసతుల విస్తరణకు స్థలం అవసరం ఉంటుందన్నారు. అనాలోచితంగా స్కూల్ నిర్మాణానికి స్థలం కేటాయించడం సరైంది కాదని విమర్శించారు. వైద్య వ్యర్థాల నిర్వహణ జరుగుతున్న ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేయడం ప్రమాదకరమన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు లేఖ రాసి, ఫోన్ ద్వారా పరిస్థితులను వివరించి నిర్ణయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఇతర స్థలాలు అందుబాటులో లేకుంటే స్కూల్ నిర్మాణానికి సొంత స్థలం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, గంధం బాలపీర్, గంధం పరంజ్యోతి, ధర్మా నాయక్, కౌన్సిలర్లు మురళీసాగర్, శ్రీకర్‌గౌడ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, హరిబాబు, బండారు కృష్ణ ఉన్నారు.


