లీడర్ల ‘లడాయి’..!
తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..
దూకుడు పాలి‘ట్రిక్స్’ (కేరాఫ్) నడిగడ్డ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంతో పాటు పాలమూరులో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు గద్వాల, అలంపూర్ పెట్టింది పేరు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నది మధ్య నడిగడ్డ (జోగుళాంబ గద్వాల)గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకవైపు ఏపీ, మరోవైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆధిపత్యమే హద్దుగా అసమాన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ జిల్లాలో ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని విపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ చిచ్చు రాజకీయ రగడకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పలువురు లీడర్ల లడాయి, వారి వ్యవహార శైలి హాట్‌టాపిక్‌గా మారింది.
గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆయా వర్గాల మధ్య పోటాపోటీ నడిచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. తమకు 16 వార్డులు కేటాయించాలని ఓ వర్గం వారు పార్టీ ముఖ్య నేతలకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. లేకుంటే మీ ఇష్టమంటూ మరో వర్గ నేత సమాధానమిచ్చినట్లు సమాచారం. స్వపక్షంలో విపక్షంలా ముదిరిన పంచాయితీ కీలక నేతలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ లొల్లి రాష్ట్ర పెద్దల వద్దకు చేరినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
‘ఆధిపత్య’మే హద్దుగా
అసమాన రాజకీయాలు
అటు అధికార,
ప్రతిపక్షాలు.. ఇటు
స్వపక్షంలోనే విపక్షం
నాగర్‌కర్నూల్ ఎంపీ, అలంపూర్‌ఎమ్మెల్యే మధ్య రగడతో మళ్లీ తెరపైకి..
హాట్‌టాపిక్‌గా ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల వ్యవహార శైలి


