పురపాలికల అభివృద్ధే ధ్యేయం
● అమరచింతలో 50 ఎకరాల్లో
రొయ్యల పెంపకం
● పట్టణ చెరువుల ఆధునికీకరణకు సిద్ధం
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
అమరచింత/ఆత్మకూర్: అమరచింత మండలంలోని ప్రభుత్వ స్థలంలో రూ.50 కోట్లతో 50 ఎకరాల్లో రొయ్యల పెంపకం చేపడతామని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం అమరచింతలో రూ.3 కోట్లతో పెద్ద చెరువు ఆధునికీకరణ, రూ.3.14 కోట్లతో ఆత్మకూర్‌లోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట విస్తరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమరచింత చెరువుకట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, సయ్యద్‌షా రాజావళి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అమరచింతలో రెండేళ్లలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. జూరాల ప్రాజెక్టు సమీపంలో చేప వంటకాలు చేస్తున్న వారితో పాటు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేపల ఎగుమతి కేంద్రం, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయించానన్నారు. ప్రాజెక్టు రక్షణతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల నుంచి అక్రమ రవాణా జరగకుండా రూ.2.50 కోట్లతో ఎడమ కాల్వ సమీపంలో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుసంవర్దకశాఖ ద్వారా 200 యూనిట్లను మంజూరు చేయించి ఒక్కో లబ్ధిదారుకి రెండు గేదెలను రాయితీపై అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేగాకుండా ఇక్కడే పాలను నిల్వచేసి విజయ డైరీకి పంపేందుకు పాల శీతలకేంద్రం సైతం మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు.
అభివృద్ధికే పట్టం కట్టాలి..
ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్‌పార్టీని ఆదరించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపిస్తే పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.
చేనేత రుణమాఫీ చెక్కు అందజేత..
బ్యాంకుల్లో రూ.లక్షలోపు చేనేత రుణం పొందిన కార్మికులకు రుణమాఫీ వర్తింపజేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక యూనియన్ బ్యాంకులో రూ.67,02,800 చెక్కును మంత్రి చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందు సమక్షంలో మేనేజర్‌కు అందించారు. మిగిలిన వారి రుణమాఫీ డబ్బులు త్వరలోనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ఏడీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, కాంగ్రెస్‌పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, చెరువు సంఘం అధ్యక్షుడు పోసిరిగారి విష్ణు, శ్యాం, రవికాంత్, మోహన్, కమలాకర్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు తిరుమల్లేష్, హన్మంతునాయక్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.


