‘స్థానికం’లో పోలీసుల కృషి అభినందనీయం
వనపర్తి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ఓటర్లకు పూర్తి భద్రత కల్పిస్తూ నిర్వహించడంలో ఎన్నికలసెల్ పోలీసు అధికారులు, సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని, వారి కృషి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల సెల్ పోలీసు అధికారులు, సిబ్బందికి నగదు రివార్డులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిబంధనల అమలు, పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా ఎలక్షన్‌సెల్ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో భద్రత ఏర్పాట్లు చేయడం, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తతతో విధులు నిర్వహించడంతో జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా ముగిశాయన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సెల్ పోలీసు అధికారులు స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ రామేశ్వర్‌రెడ్డి, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది వెంకటన్నగౌడ్, రవీంద్రబాబు, నగేష్, శ్రీనునాయక్, రంజిత్‌కు నగదు రివార్డు అందజేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలన్నారు.
పదోన్నతులు గౌరవం, బాధ్యత పెంచుతాయి..
పోలీసుశాఖలో పదోన్నతి అనేది కేవలం హోదా మార్పు మాత్రమే కాదని.. ప్రజలపై మరింత బాధ్యత, నిబద్ధతను గుర్తు చేసే గౌరవ సూచికని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పొందడం ప్రతి పోలీసు సిబ్బందికి గర్వకారణమన్నారు. కొత్తకోట పోలీస్‌స్టేషన్‌్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.వెంకట్రామారెడ్డి ఏఎస్సైగా పదోన్నతి పొందడంతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంకట్రామారెడ్డికి ఒక స్టార్‌ను అలంకరించి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పదోన్నతి పొందిన ప్రతి పోలీసు అధికారి రెట్టింపు ఉత్సాహం, నిజాయితీతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. క్రమశిక్షణ, బాధ్యత, అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బందికి శాఖాపరంగా తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం లభిస్తాయని తెలిపారు.


