పుర ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
వనపర్తి: త్వరలో జరిగే పుర ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఉమ్మడి పాలమూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి సమీక్షించారు. ఫొటోలతో కూడిన ఎలక్ట్రోరల్ ప్రచురణ, పంపిణీ, లెక్కింపు కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల ఎంపిక, పోలింగ్ సిబ్బంది తదితర అంశాలపై ఆరా తీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బ్యాలెట్ పత్రాల ముద్రణ పకడ్బందీగా జరిగేలా చూడాలని సూచించారు. నామినేషన్ సమయంలో వెబ్‌కాస్టింగ్, వీడియో చిత్రీకరణ జరగాలన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు పురపాలికల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఫొటోతో కూడిన ఎలక్ట్రోరల్ విడుదల చేశామని, ప్రజల నుంచి వచ్చిన సుమారు 200 అభ్యంతరాలు పరిశీలించి పరిష్కరించినట్లు చెప్పారు. జిల్లాలోని 80 వార్డులు, 1,17,441 మంది ఓటర్లకు సరిపడా 191 పోలింగ్ కేంద్రాలను గుర్తించి మున్సిపల్ అధికారులు పరిశీలించి వాటిలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. గురువారం రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఉంటుందని, పోలింగ్ సిబ్బంది వివరాలు ఇప్పటికే టి–పోల్‌లో నమోదు చేసినట్లు వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీపీఓ రఘునాథ్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


