క్రీడలతో ఆరోగ్యకర జీవితం
వనపర్తిటౌన్: క్రీడలతో ఆరోగ్యకర జీవితం, ప్రశాంత మనస్సు, సమతుల వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన మాధవరెడ్డి స్మారక ఫుట్‌బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు నగదు, జ్ఞాపికలు అందజేసి మాట్లాడారు. ఆసియాలో క్రికెట్‌కు, ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఎక్కువ ఆదరణ ఉందని చెప్పారు. క్రీడలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాదని.. అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, నియమనిష్టలు అలవడుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించడం నేర్చుకుంటామని చెప్పారు. ఫుట్‌బాల్, క్రికెట్ ఆడటంతో టీం వర్క్, ఇతరులను గౌరవించడం, నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. క్రీడల్లో ఏజీ హైదరాబాద్ జట్టు విజేతగా నిలవగా రూ.50 వేలు, జ్ఞాపిక, రన్నర్‌గా నిలిచిన వనపర్తి జట్టుకు రూ.30 వేలు, జ్ఞాపిక, మూడోస్థానంలో నిలిచిన గ్లోబ్ హైదరాబాద్ జట్టుకు రూ.20 వేలు, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ఆదిత్యారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పీఎఫ్‌తో కార్మికులకు ప్రయోజనం
అమరచింత: కంపెనీల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని.. ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయం రంగారెడ్డి, హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘాన్ని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనా, ఎంప్లాయ్ ఎన్‌రోల్‌మెంట్ కాంపెయిన్ గురించి వివరించారు. కంపెనీ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులకు కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు. యాజమాన్యం ప్రతి కార్మికుడు, ఉద్యోగికి పీఎఫ్, ఇన్స్యూరెన్స్, పింఛన్ అందించేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో కంపెనీ సీఈఓ ఎం.చంద్రశేఖర్, కంపెనీ డైరెక్టర్ పబ్బతి అశోక్, స్టాఫ్ మహేష్ పాల్గొన్నారు.
రాజాగారి బంగ్లా
మరమ్మతుకు రూ.10 కోట్లు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో శిథిలావస్థకు చేరిన రాజాగారి బంగ్లా మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతిగృహాల పునరుద్ధరణకు రూ.13.15 కోట్లు కేటాయించినట్లు వివరించారు. వచ్చిన నిధులతో రాజాగారి బంగ్లాను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు.
25 నుంచి
ఐద్వా మహాసభలు
పాన్‌గల్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆలిండియా మహాసభలు కొనసాగుతాయని.. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల కోరారు. మండలంలోని తెల్లరాళ్లపల్లిలో బుధవారం సాయంత్రం మహాసభల వాల్‌పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు, విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన హక్కులు తదితర అంశాలపై చర్చించేందుకు మహాసభలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఐద్వా నిరంతరం పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకురాలు పావని, సాయమ్మ, సుశీల, దేవమ్మ, కవిత, శాంతమ్మ, లక్ష్మి, వెంకటమ్మ, అలివేలు, బతుకమ్మ, లక్ష్మి, నారమ్మ, ఈదమ్మ, చంద్రమ్మ పాల్గొన్నారు.
క్రీడలతో ఆరోగ్యకర జీవితం
క్రీడలతో ఆరోగ్యకర జీవితం


