గణతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
వనపర్తి: జిల్లాలో జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై అన్నిశాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. బందోబస్తు, ఫ్లాగ్‌మార్చ్ బాధ్యతలను పోలీస్‌శాఖకు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, ప్రొటోకాల్, ముఖ్యఅతిథులకు ఆహ్వానం బాధ్యతను ఆర్డీఓకు, బారికేడ్లు, స్టాల్స్, డయాస్ ఏర్పాట్లను రోడ్లు, భవనాలశాఖకు అప్పగించారు. వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాట్లుకు అన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
25న జాతీయ ఓటరు దినోత్సవం..
25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. 23న కార్యాలయాలు, విద్యాలయాల్లో విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించాలని, ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


