పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
అమరచింత: తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడమేగాకుండా పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పశుసంవర్దకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని పది వార్డుల్లో రూ.15 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం స్థానిక పురపాలికకు ఇప్పటి వరకు రూ.35 కోట్లు కేటాయించిందని.. మునుపెన్నడూ లేని విధంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, పార్క్‌లు, కూడళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని.. అనంతరం ప్రతి ఒక్కరూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, మార్కెట్ డైరెక్టర్లు పోసిరిగారి విష్ణు, శ్యామ్, కమలాకర్‌గౌడ్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.


