ఎవరిదో పైచేయి..!
కాంగి‘రేసు’లో పురపాలక పీఠాల లొల్లి
ఇద్దరు నుంచి ఆరుగురు వరకు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందు లో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మిన హా మిగిలిన 19 పురపాలికల్లో ఎన్నికలు జరగనున్నా యి. కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, మిగతా మున్సిపాలిటీల్లో 310 వార్డులు ఉండగా.. ఒక్క దాంట్లో కనీ సం ఇద్దరు.. అధికంగా ఆరుగురు వరకు ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో పోటాపోటీ నెలకొంది. అదేవిధంగా మేయర్, చైర్మన్ పదవులకూ ప్రధానంగా ఇద్దరు నుంచి నలుగురు వర కు ద్వితీయ శ్రేణి ముఖ్య నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సి‘పోల్స్’కు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికలకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరులోని నగర, పట్టణాల్లో రాజకీయ సందడి ఊపందుకుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుండడంతో నాలుగైదు రోజుల్లోపే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు డివిజన్లు,వార్డుల పరిధిలో కార్పొరేటర్లు,కౌన్సిలర్ల ఆశావహులు యువతను వెంటేసుకుని విందులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మేయర్, చైర్మన్, చైర్‌పర్సన్ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్‌లో పలువురి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి రాగా.. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
మేయర్/చైర్మన్ గిరి కోసం ఆశావహుల తీవ్ర ఒత్తిళ్లు
కార్పొరేటర్/కౌన్సిలర్ పదవులకు సైతం..
వర్గాల వారీగా చీలిన ఎమ్మెల్యేలు, డీసీసీ, కీలక నేతలు
తమ అనుచరులకు దక్కేలా ఎవరికి వారు పావులు
రసవత్తరంగా మారిన గ్రూప్ రాజకీయాలు
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం లోకసభ స్థానాల వారీగా ఇన్‌చార్జీలను నియమించిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించింది. వీరు ఆయా మున్సిపాలిటీల పరిధిలో నేతలను సమన్వయం చేసుకుంటూ గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా కసరత్తు చేపట్టాలి. ఆయా మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఆశావహులు అధికంగా ఉండడంతో పాటు గ్రూప్ రాజకీయాలు వారికి గుదిబండగా మారాయి. సరైన వ్యూహంతో ముందుకు సాగకపోతే పంచాయతీ ఎన్నికల మాదిరిగా రెబల్స్ బరిలో నిలిచే అవకాశముందని పార్టీలోని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


