నేటి నుంచి లక్ష్మీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
కొత్తకోట రూరల్: తిరుమల వేంకటేశ్వరస్వామికి ప్రతిరూపంగా ప్రసిద్ధిగాంచిన మండలంలోని అమడబాకుల స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ తదియ నుంచి నవమి వరకు స్వామివారి ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు మరిగంటి జగన్మోహనాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు.
● బుధవారం ఉదయం 10 గంటలకు పందిర్లు, సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ.
● గురువారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6 గంటలకు పిల్లలతో తల్లిదండ్రులకు పాదపూజ, రాత్రి 7 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం.
● శుక్రవారం ఉదయం 8 గంటలకు హోమం, బలిహరణం, 9.30కి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాల సేవ, 11.55 గంటలకు కల్యాణం, మధ్యాహ్నం 2 నుంచి ప్రసాద వితరణ (అన్నదానం), రాత్రి 9 గంటలకు డోలోత్సవం.
● 24న ఉదయం 9, రాత్రి 7 గంటలకు హోమం, బలిహరణం, రాత్రి 9కి ప్రభోత్సవం.
● 25న ఉదయం 9, సాయంత్రం ఆరు గంటలకు హోమం, బలిహరణం, రాత్రి 9కి రథోత్సవం.
● 26న ఉదయం 9 గంటలకు హోమం, బలిహరణం, సాయంత్రం 6 గంటలకు గ్రోమోత్సవం (ఊరేగింపు), రాత్రి 7 గంటలకు హోమం, బలిహరణం, 9 గంటలకు దోపోత్సవం.
● 27న ఉదయం 8 గంటలకు హోమం, పూర్ణాహుతి, తీర్థావళి (చక్రస్నానం), రాత్రి 8 గంటలకు నాగవెల్లి, దేవత ఉద్వాసన, ధ్వజ అవరోహణంతో కార్యక్రమాల ముగింపు.
● 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 5 వరకు జాతర.
అభయమిస్తున్న అఖండ జ్యోతి..
ఆలయంలోని అఖండజ్యోతి దివ్యజ్యోతిగా వెలుగుతూ భక్తులకు అభమిస్తోంది. 2002లో తిరుపతి నుంచి జ్యోతి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 118 కుండల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. నాటి నేటి వరకు జ్యోతి నిర్విరామంగా వెలుగుతూ భక్తులకు దర్శనమిస్తోంది.
ఘనంగా ఆభరణాల ఊరేగింపు
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామివారి ఆభరణాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కొత్తకోటలోని యూనియన్ బ్యాంకు లాకర్‌లో ఉన్న ఆభరణాలను గ్రామపెద్దల సమక్షంలో ఆలయ నిర్వాహకులు తీసుకొని మేళతాళాలు, భక్తుల ఊరేగింపు నడుమ పాదయాత్రగా ఆలయానికి తీసుకొచ్చారు. ఈ ఆభరణాలను బుధవారం స్వామివారిని అలంకరించనున్నట్లు అర్చకులు తెలిపారు.
23న కల్యాణం.. 25న రథోత్సవం
నేటి నుంచి లక్ష్మీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు


