రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
వనపర్తి: జిల్లాలోని జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో పోలీసు, జాతీయ రహదారులు, వైద్య, ఆరోగ్య, పీఆర్ తదితర శాఖల అధికారులతో రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించగా.. కలెక్టర్‌తో పాటు ఎస్పీ సునీతరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని, రహదారుల నిర్మాణాలు, మరమ్మతు చేపట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వేగాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన చోట రాంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్నారు. పెబ్బేరు సమీపంలోని మోడల్ స్కూల్, రంగాపురం గ్రామం వద్ద అధిక ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ వంతెనల నిర్మాణానికి సిఫారస్ చేయాలని సూచించారు. రంగాపురం గ్రామం వద్ద యూటర్న్ ప్రమాదకరంగా ఉందని, అండర్ పాస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తకోట సమీపంలోని ముమ్మాళ్లపల్లి, అమడబాకుల, పాలెం స్టేజీల వద్ద రోడ్ క్రాసింగ్ ప్రమాదకరంగా ఉందని ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా హైమాస్ట్ లైటింగ్, రాంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్స్, సైన్‌బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణాలకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రులకు తీసుకెళ్లే వ్యవస్థపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కూడళ్లలో వాహనాల వేగాన్ని కట్టడి చేసేందుకు రాంబల్ స్ట్రిప్స్ వేయడంతో పాటు మిర్రర్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాజపేట పాఠశాల వద్ద సైన్‌బోర్డులు, ఆత్మకూరు చెరువుకట్టపై లైటింగ్‌తో పాటు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు బిగించాలని సూచించారు. మదనాపురం వంతెన అప్రోచ్ పనులు పూర్తిచేసి వంతెనను వినియోగంలోకి తేవాలన్నారు. జిల్లాలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ అధికారి దేశ్యానాయక్, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


