రైతుల ఉత్సాహానికే బండలాగుడు పోటీలు
వనపర్తి రూరల్: ఎలాంటి బెట్టింగులు లేకుండా రైతుల ఉత్సాహం కోసమే బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరులోని చెలిమిళ్ల, కిష్టారెడ్డిపేటలో ఉన్న వేణుగోపాలస్వామి ఉత్సవాల సందర్భంగా మంగళవారం రెండోరోజు నిర్వహించిన న్యూ కేటగిరి విభాగం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన అనన్యారెడ్డి ఎద్దులు మొదటి స్థానంలో నిలిచి రూ.50 వేలు గెలుపొందాయి. వీరికి దాత బొజ్జమ్మ, లచ్చమ్మ నగదు అందజేశారు. చిన్నంబావి మండలం కొప్పునూర్‌కు చెందిన బంకుమీది దర్శన్‌రెడ్డి ఎద్దులు రెండోస్థానంలో నిలవగా రూ.40 వేలు.. అనంతపురం జిల్లా పెంచలపాడుకు చెందిన రాకెట్ల భీమలింగప్ప, ఉబ్బిచెర్ల గ్రామ ఆముదాల రమేష్ ఎద్దులు మూడోస్థానంలో నిలిచి రూ.30 వేలు.. కొత్తకోటకు చెందిన గుర్నాథ్ ఎద్దులు నాలుగోస్థానంలో నిలిచి రూ.20 వేలు, గద్వాల జిల్లా జమ్మిచేడుకు చెందిన వెంకటేష్, కర్నూల్ యామిని ఎద్దులు ఐదో స్థానంలో నిలిచి రూ.15 వేలు, లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన ధనుష్ ఎద్దులు ఆరోస్థానంలో నిలిచి రూ.10 వేలు గెలుచుకున్నాయి. ఆయా వృషభాల యజమానులకు ఆలయ కమిటీ సభ్యులు నగదు అందజేశారు. కమిటీ సభ్యులు రామన్‌గౌడ్, కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి, నవీన్‌కుమార్‌గౌడ్, ఆంజనేయు లు, మోహన్‌గౌడ్ ,రాముడు, పరశురాముడు, కార్తీక్, కుర్వ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.5 లక్షల విరాళం..
పెబ్బేరులోని చౌడేశ్వరిదేవి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికిగాను రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, వెంకట్రాములు, దయాకర్‌రెడ్డి, రంజిత్‌కుమార్, రాములుయాదవ్ పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
వీపనగండ్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుంచి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శివగౌడ్ తెలిపారు. మొదటిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్, గురువారం రెండోసంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్, శుక్రవారం తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. 24వ తేదీ శనివారం మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని వివరించారు.
రామన్‌పాడులోపూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో మంగళవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 925 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.


