వంతెన నిర్మాణంతో తగ్గనున్న దూరం
ఆత్మకూర్: జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్యనున్న కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణంతో ఆయా ప్రాంతాల మధ్య దూరం తగ్గనుందని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆయన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కార్యకర్తలతో కలిసి కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు, తాత్కాలిక రోడ్డుపై జూరాల పుష్కరఘాట్ నుంచి కొత్తపల్లి శివారు వరకు నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలంలోని పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లావాసి కావడం అదృష్టమని, అడిగిన వెంటనే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని వివరించారు. నిర్మాణం పూర్తయితే వనపర్తి నుంచి మంత్రాలయం, ఎమ్మిగనూరు వెళ్లే ప్రయాణికులకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గునుందని వివరించారు. ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్లాలంటే 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉందని.. బ్రిడ్జి పూర్తయితే కేవలం 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చన్నారు. త్వరలో నాలుగు వరుసల రహదారి రాబోతుందని వెల్లడించారు. ఏడాదిన్నరలో పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, గద్వాల మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గద్వాల, మక్తల్ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి


