సాగునీటి వృథా!
జూరాల ప్రధాన ఎడమకాల్వ షట్టర్లకు లీకేజీలు
● మూసినా ఆగని ప్రవాహం
● మూడేళ్ల కిందట మరమ్మతు..అయినా ఫలితం శూన్యం
● జలాశయంలో రోజురోజుకు తగ్గుతున్న నీటిమట్టం
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లకు మూడేళ్ల కిందట మరమ్మతు చేపట్టారు. షట్టర్లు మూసినా లీకేజీల కారణంగా నీటి ప్రవాహం నిలువరించలేని పరిస్థితి నెలకొంది. కాల్వ వెంట వారంలో మూడు రోజుల పాటు సుమారు 60 క్యూసెక్కుల నీరు వృథాగా పారుతోంది. దీంతో ప్రాజెక్టులోని నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయంలో 4.264 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో 20 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని తాగునీటి పథకాలకు నీటిని అందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జలాశయం ప్రధాన గేట్లతో పాటు కుడి, ఎడమ కాల్వల షట్టర్ల లీకేజీలతో నీరు మరింత వృథా అవుతోందని ఆయకట్టు రైతులతో పాటు ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
జూరాల ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లు
వారబందీ విధానంలో..
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టుకు వారబందీ విధానంలో రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున వారంలో 4 రోజుల పాటు సాగునీటిని వదులుతున్నారు. మిగిలిన మూడు రోజులు పూర్తిస్థాయిలో మూసి నీటి సరఫరాను నిలిపివేస్తారు. కాని ఆ సమయంలోనూ లీకేజీలతో రోజుకు 60 క్యూసెక్కుల నుంచి 70 క్యూసెక్కుల వరకు నీరు వృథాగా కాల్వలో పారుతుండటంతో జలాశయంలో నీటిమట్టం తగ్గి వేసవిలో ఆయకట్టుకు సాగునీటి కష్టాలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.


