ఎస్పీ గ్రీవెన్స్‌కు 15 వినతులు..
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 15 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ సునీతరెడ్డి హాజరై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు ఫోన్‌చేసి తక్షణమే సదరు ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
అంబులెన్స్ సేవలు
వినియోగించుకోవాలి
వీపనగండ్ల/చిన్నంబావి: రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవల కోసం అందుబాటులో ఉంచిన 102, 108 వాహనాలను ప్రజలు వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి కోరారు. సోమవారం వీపనగండ్ల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, చిన్నంబావిలో ఉన్న 102, 108 వాహనాలను తనిఖీ చేసి పరికరాలు, వాటి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులను దగ్గర్లోని ఆస్పత్రులకు 108 వాహనాల్లో చేరవేస్తున్నామని, గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం, ప్రసవం తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చడం, 5 ఏళ్లలోపు చిన్నారులకు అవసరమయ్యే టీకాలు వేయించేందుకు 102 అమ్మఒడి వాహనాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది ఆపదలో ఉన్నవారితో గౌరవంగా వ్యవహరించి సత్వర వైద్యసాయం అందేలా చూడాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఎగ్జిక్యూటివ్ మహబూబ్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సాయికుమార్, పైలెట్ మైనుద్దీన్ ఉన్నారు.
‘ఆదర్శ’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి టౌన్: జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో (టీజీఎంఎస్) 2026–27 విద్యాసంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు http://tgrns.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఉంటుందని.. పూర్తి వివరాలకు మోడల్ స్కూల్ వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌కు
అదనపు బస్సులు
వనపర్తిటౌన్: సంక్రాంతి సెలవుల తర్వాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ మార్గంలో 82 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌లో సూపర్‌వైజర్లు, సిబ్బందితో కలిసి ఆయన బస్సుల రాకపోకలు, ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా బస్సులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మార్గంలో 60 ట్రిప్పులు నడుపుతుండగా సోమవారం ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అదనంగా మరో 22 ట్రిప్పులు పెంచినట్లు వివరించారు. వనపర్తి–బిజినేపల్లి, వనపర్తి–కొత్తకోట మీదుగానే కాకుండా పెబ్బేరు నుంచి కూడా హైదరాబాద్‌కు బస్సులు నడిపేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్‌కు రద్దీ పెరగడంతో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచామని.. రాత్రి 9 వరకు బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఎండీ ఆదేశాల మేరకు ఆర్టీసీ సిబ్బందికి బస్టాండ్‌లోనే భోజనం అందించినట్లు తెలిపారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు 15 వినతులు..
ఎస్పీ గ్రీవెన్స్‌కు 15 వినతులు..


