మాధవరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తిటౌన్: ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ నిరాడంబర జీవితం గడిపిన స్వర్గీయ జిల్లెల మాధవరెడ్డి జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పశుసంవర్దక, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మూడురోజుల పాటు జరిగే స్వర్గీయ జిల్లెల మాధవరెడ్డి స్మారక ఫుట్‌బాల్ పోటీలను సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, శాట్స్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి క్రీడాజ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యూరాలజిస్ట్‌గా సంపాదించుకునే అవకాశాలున్నా, వాటిని కాదని జిల్లా ప్రజలకు ఉచిత వైద్యం అందించి వారి హృదయాల్లో నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని జయన్న తిర్మలాపూర్‌లో పుట్టిన తన పెద్దన్న మాధవరెడ్డి 11వ తరగతి వరకు వనపర్తిలో, ఉన్నత విద్య హైదరాబాద్‌లో పూర్తి చేసినట్లు చెప్పారు. వారంలో 5 రోజులు నిమ్స్ ఆస్పత్రిలో.. రెండ్రోజులు జిల్లాకేంద్రంలోని సత్యసాయిబాబా ఆలయంలో రోగులకు ఉచిత వైద్యం అందించేవారన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని రోజులు బతికామని కాకుండా ఎలా బతికామన్నదే ముఖ్యమని, ప్రజలు గొప్పగా చెప్పుకొనేలా జీవించాలన్నారు. మాధవరెడ్డి తమ జిల్లా వాసిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. శాట్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మాధవరెడ్డి పేరున క్రీడాపోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. మాధవరెడ్డి పేరున ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని కోరారు. స్థానిక కళాకారులు రాజారాం ప్రకాష్, రాంరెడ్డి తమ పాటల ద్వారా మాధవరెడ్డి జీవితాన్ని వివరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి 12 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.శ్రీనివాస్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి


