మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని.. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఇందిరమ్మ చీరలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు, మహిళలకు ప్రాధాన్యమిస్తూ వారి పేరునే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ప్రతి మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మహిళలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీలో వెయ్యి బస్సులకు యజమానులను చేశామని చెప్పారు. వడ్డీలేని రుణాలు, సోలార్ యూనిట్లు, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ తదితర వాటిని మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందిస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఇందిరా మహిళాశక్తి కింద కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన మహిళ సంఘాలకు రూ.65 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పుర కమిషనర్ సైదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, నాయకులు ఎన్‌జే బోయేజ్, కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, డా. పీజే బాబు, వేముల శ్రీనివాస్‌రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి, సర్పంచ్ మాసన్న, ఉమామహేశ్వర్‌రెడ్డి, ముజీబ్, సంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


