లేబర్ కోడ్లు రద్దు చేయాలి : సీఐటీయూ
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుచేసి కార్మికుల హక్కులను కాపాడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ కోరారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం సంయుక్తంగా జిల్లాకేంద్రంలోని రాజాగారి బంగ్లా నుంచి ఆర్టీసీ డిపో, రాజీవ్‌చౌక్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానిలాంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్ల అమలు, విద్యుత్ సవరణ చట్టం, విత్తనబిల్లు, వీబీ జీ రాంజీ చట్టం, బీమా రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడుల అనుమతి, అణురంగంలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతిస్తూ చట్టం చేసిందన్నారు. వీటికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా చేపట్టే ఆందోళనల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని అన్ని సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బిలి నిక్సన్, ఉనితా, శారద, రాజు, రాము, కవిత, హనీఫ్, కార్మికులు పాల్గొన్నారు.


