రామన్‌పాడు.. సమస్యలు మెండు
త్వరలో పరిష్కరిస్తాం..
మదనాపురం: రామన్‌పాడు జలాశయం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రాజెక్టు భద్రత నుంచి సాగునీటి నిర్వహణ వరకు ప్రతి విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రూ.లక్షలు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
అంధకారంలో ప్రాజెక్టు కట్ట..
ప్రాజెక్టు రక్షణలో భాగంగా ప్రధాన డ్యామ్, కట్టకు ఇరువైపులా రాత్రివేళల్లో వెలుతురు కోసం 48 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం కేవలం 4 లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. మిగిలినవన్నీ మరమ్మతుకు గురై అలంకారప్రాయంగా మారాయి. రాత్రివేళ ప్రాజెక్టు ప్రాంతమంతా అంధకారం నెలకొని అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించడం కష్టతరమవుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
వృథా అవుతున్న నీరు..
ఓఏపీ కాల్వ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జలాశయం నుంచి కాల్వకు నీటిని నియంత్రించే షట్టర్లు లేకపోవడంతో నిరంతరం వాగులోకి ప్రవహిస్తూ వృథా అవుతున్నాయి. నిల్వ నీరు ఇలా వృథా అవుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అజ్జకొల్లు, అప్పరాల, రామాపురం, శాఖాపురం రంగాపురం, రాంపూర్ గ్రామాలకు సరఫరా చేయాల్సిన సాగునీరు షట్టర్లు లేక రైతులకు శాపంగా మారింది.
మొక్కలకు బిందెలతోనే..
ప్రాజెక్టు పర్యవేక్షణకు వచ్చే అధికారుల కోసం నిర్మించిన అతిథిగృహంలో నీరు కూడా లేని దుస్థితి నెలకొంది. అక్కడ పనిచేసే సిబ్బంది పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఆవరణలో నాటిన మొక్కలకు ప్రాజెక్టు నుంచి బిందెలతో మోసుకొచ్చి అందిస్తున్నారు. ప్రాజెక్టు నిండా నీరున్నా.. గెస్ట్‌హౌస్ ఆవరణలో మాత్రం నీటికరువు వేధించడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది.
అంధకారంలో రామన్‌పాడు జలాశయం ఆనకట్ట
ఓఏపీ కాల్వకు షట్టర్లు లేక వృథా అవుతున్న నీరు
ఓఏపీ కాల్వకు షట్టర్లు లేక
వృథా అవుతున్న నీరు
కట్టపై 48 విద్యుద్ధీపాలు.. వెలిగేది నాలుగే...
అతిథిగృహంలో నీటి కరువు
పట్టించుకోని అధికార యంత్రాంగం
ప్రాజెక్టు వద్ద నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఒక్కొక్కటిగా ప్రతిపాదనలు తయారుచేసి నివేదించాం. వీధిదీపాలు, మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. సత్వరమే పరిష్కరిస్తాం.
– వరప్రసాద్, ఏఈ, రామన్‌పాడు జలాశయం
రామన్‌పాడు.. సమస్యలు మెండు


