25 నుంచి హాజీమలాంగ్ బాబా ఉర్సు
అమరచింత: మండలంలోని మస్తీపురం గుట్టలో వెలిసిన సయ్యద్‌షా హజ్రత్ హాజీమలాంగ్ బాబా ఉర్సు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు కొనసాగుతుందని ముర్షద్ మైనుద్దీన్ ఆదివారం తెలిపారు. 25న గంధోత్సవం, 26న ఉర్సు, 27న ఫాతేహాలు ఉంటాయని వివరించారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసరాలను సుందరీకరించే పనుల్లో నిర్వాహకులు లీనమయ్యారు. హాజీమలాంగ్ బాబా దర్గా షరీఫ్‌ను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచేగాక మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివచ్చి కందూర్లు నిర్వహించడం అనాదిగా వస్తోంది. ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని నిర్వాహకులు వివరించారు.
రామన్‌పాడులో
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం పూర్తిస్థాయి నీటిమ ట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడ మ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచిపోగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కు లు, కుడి, ఎడమ కాల్వకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
‘ప్రతిపక్షాల విజయాన్ని దెబ్బతీసేలా రిజర్వేషన్లు’
వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో వార్డుల రిజర్వేషన్లు శాసీ్త్రయ పద్ధతిలో జరగలేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల విజయ అవకాశాలు దెబ్బతీసేలా, అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్లు ఇచ్చారని మండిపడ్డారు. లక్కీడిప్ విధానంలో రిజర్వేషన్లు కేటాయిస్తున్నప్పుడు అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా తర్వాత ఫిర్యాదు చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్ధులు మెజార్టీ స్థానాలు గెలవలేరనే.. రిజర్వేషన్లలో గందరగోళాన్ని స్పష్టించారని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు బత్తిని మధుసూదన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
వనపర్తిటౌన్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగే ఐద్వా 14వ జాతీయ మహాసభలకు మహిళలు, ప్రజలు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్‌లో జాతీయ మహాసభల వాల్‌పోస్టర్లను స్థానిక నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వానికి నిరంతరం పోరాడుతున్న ఐద్వా.. ఈ మహాసభలతో ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవనుందని చెప్పారు. మహిళా ఉద్యమాలకు కొత్త దశను చూపనుందని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు సాయిలీల, సహాయ కార్యదర్శి ఉమా, సుగుణమ్మ, బాలకిష్టమ్మ, జయమ్మ ,రేణుక, అలివేల, శశికళ పాల్గొన్నారు.
రేపటి నుంచి పాలెం
వేంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శ్రీవారి అభిషేకం, కోయిల్ అళ్వార్ తిరుమంజనం, యాగశాల ప్రవేశం, రక్షాబంధన్, హంసవాహన సేవ, బుధవారం నిత్యారాధన, బలహరణం, ధ్వజారోహణం, గరుడ పొంగళి నివేదన, సంతానం లేని వారికి ప్రసాద వితరణ, హనుమత్ వాహన సేవ, నివేదన ఉంటుంది. గురువారం నిత్య పూజలు, ప్రబంధ పారాయణం, లక్ష పుష్పార్చన, గరుడ వాహన సేవ, శుక్రవారం అలివేలు మంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం, గజ వాహన సేవ, శనివారం హోమం, పల్లకిసేవ, ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, రథోహోమం, కుంభ పూజ, శ్రీవారి మాఢ వీధుల్లో రథోత్సవం (తేరు), వచ్చే సోమవారం స్వామివారి ఉద్దాల మహోత్సవం, బలహరణం, అశ్వవాహన సేవ, వచ్చే మంగళవారం స్వామివార్లకు పూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజ అవరోహణం, పుష్పయాగం, శేషవాహన సేవ, పవళింపు సేవ, పండిత సన్మానాలు, ఉత్సవ పరిసమాప్తితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
25 నుంచి హాజీమలాంగ్ బాబా ఉర్సు


