గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు
వనపర్తి రూరల్: గర్భిణులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని జిల్లా వైద్యాధికారి ఆలె శ్రీనివాసులు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ఆ శాఖ ఆధ్వర్యంలో ‘మాత, శిశు సంరక్షణ.. పోషకాహారంశ్రీపై జిల్లా మాత, శిశు సంరక్షణ అధికారి డా. మంజుల ఏఎన్‌ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు సమయానికి పరీక్షలు చేయించుకుంటే రక్తహీనత, పోషక లోపాలు తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఏఎన్‌ఎంలు వారిలో పోషక లోపాలు గుర్తించి సమగ్ర సేవలు అందించి రక్తహీనత, పోషక సలహాలు ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య పర్యవేక్షణ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మోతాదు, ప్రసవ అనంతర సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ నర్సింహారావు, డేటా మేనేజర్ వెంకటకృష్ణారెడ్డి, గిరిజ తదితరులు పాల్గొన్నారు.


