బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు
● ప్రోత్సహిస్తే కేసుల నమోదు
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
కొత్తకోట రూరల్: బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం 18 ఏళ్లు నిండని యువతులకు పెళ్లి చేయడం నేరమని.. వాటిని నివారించే బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం పరిధిలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులపైనే కాకుండా వివాహానికి హాజరైన వారు, ప్రోత్సహించిన వారు శిక్షార్హులన్నారు. గ్రామస్థాయిలో బాల్య వివాహాల కట్టడిలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్ల పాత్ర కీలకమని తెలిపారు. ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే టోల్‌ఫీ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామంలో రెండేళ్లుగా ఒక్క బాల్య వివాహం కేసు కూడా నమోదు కాకపోవడం అభినందనీయమని కొనియాడారు. బాలికలను బాగా చదివిస్తే జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సమావేశంలో డీపీఓ తరుణ్ చక్రవర్తి, జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, డీసీపీఓ రాంబాబు, కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వినీత్, గ్రామస్తులు పాల్గొన్నారు.


