అమృత్ 2.0.. ఆలస్యం
జిల్లాలోని 5 పురపాలికలకు రూ.128.29 కోట్లు మంజూరు
అమరచింత: పుర ప్రజలకు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి చేపడుతున్న మిషన్ 2.0 పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. జిల్లాలోని 5 పురపాలికలకు రూ.128.29 కోట్లు మంజూరు చేసి జనాభా ప్రాతిపదికన పైప్‌లైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నారు. పైప్‌లైన్ ఏర్పాటు సమయంలో స్థానిక వాటర్‌మెన్‌ల సమన్వయం లేకపోవడంతో గుంతలు తవ్వుతుండగా పాత పైప్‌లైన్లు దెబ్బతింటున్నాయి. అమరచింత పురపాలికలోని బీసీకాలనీలో ఉన్న పైప్‌లైన్‌పైనే కొత్తది వేయడం ఏమిటని మిషన్ 2.0 సిబ్బందిని కాలనీవాసులు నిలదీయడంతో తిరిగి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో జిల్లాలోని మిగిలిన పురపాలికల్లోనూ తాగునీటి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
పురపాలికల వారీగా ఇలా..
వనపర్తి పురపాలికలో మిషన్ 2.0 పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.72.36 కోట్లు మంజూరు చేసింది. వీటితో 5300 కేఎల్ సామర్థ్యం గల 8 ట్యాంకులు, 200 కేఎల్‌ల సామర్థ్యం గల సంప్ నిర్మించాల్సి ఉంది. పట్టణంలో 60 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేసి 48 వేల ఇళ్లకు తాగునీరు అందించాల్సి ఉంది.
● కొత్తకోట పురపాలికకు రూ.14.95 కోట్లు మంజూరయ్యాయి. వీటితో 2,100 కేఎల్ సామర్థ్యం గల 2 ట్యాంకులు, 20 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తిచేసి 1,260 ఇళ్లకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది.
● పెబ్బేరు పురపాలికకు రూ.10.76 కోట్లు మంజూరు కాగా 21 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంగల రెండు ట్యాంకులు, 25 కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి 1,900 ఇళ్లకు నీటిని అందించాలి.
● ఆత్మకూర్ పురపాలికకు రూ.17.22 కోట్లు మంజూరు కావడంతో 25 లక్షల సామర్థ్యంగల రెండు నీటి ట్యాంకులు, 16 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తిచేసి వెయ్యి ఇళ్లకు నీటివసతి కల్పించాలి.
● అమరచింత పురపాలికలో 11 లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు నీటి ట్యాంకులు, 16 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తిచేసి వెయ్యి ఇళ్లకు శుద్ధజలం అందించేందుకు రూ.13 కోట్లు మంజూరు చేశారు.
అమరచింతలో కొనసాగుతున్నపైప్‌లైన్ పనులు
గతేడాది ఆగస్టులో ప్రారంభమైన పనులు
నేటికీ పూర్తికాని పైప్‌లైన్లు
పెబ్బేరు, కొత్తకోటలో మరీ ఆలస్యం..
గడువులోగా పూర్తయ్యేనా?


