ప్రయాణ ప్రాంగణం.. అధ్వానం
● పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం
● దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
● పట్టించుకోని పుర, ఆర్టీసీ అధికారులు
కొత్తకోట రూరల్: జాతీయ రహదారి సమీపంలో రోజు రద్దీగా ఉండే కొత్తకోట ప్రయాణ ప్రాంగణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. చెత్తా చెదారం, మురుగు పేరుకుపోయినా శుభ్రం చేయించేందుకు అటు ఆర్టీసీ, ఇటు పుర అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అపరిశుభ్రతతో రోగాలబారిన పడతారని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. ఇక్కడి అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులతో పాటు పట్టణవాసులు ఒంటికి, రెంటికి ప్రాంగణంలో ఉన్న ముళ్లపొదల చాటుకు వెళ్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. అటుగా వెళ్లే ప్రయాణికులు, పరిసరాల్లోని నివాస ప్రాంతాల వారు రాకపోకల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● కొత్తకోట బస్టాండ్‌ను 1976, మార్చి 16న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు శంకుస్థాపన చేయగా.. 1978, ఆగస్టు 1న ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంగణం నుంచి నిత్యం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన బస్సులు 150 నుంచి 200 బస్సుల వరకు రాకపోకలు సాగిస్తుండగా.. నిత్యం సుమారు 5 వేల మందికిపైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి.
● గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్టాండ్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు ఓ రేకుల షెడ్ నిర్మించారు. షెడ్‌లో విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతకు గురవుతున్నారు. షెడ్ పక్కనే ఖాళీ స్థలం ఉండటంతో ప్రయాణికులతో పాటు పట్టణవాసులు ఒంటికి, రెంటికి వెళ్తున్నారు.
బస్టాండ్ ప్రాంగణ సమీపం, ప్రాంగణంలోని దుకాణాల వెనుకభాగం వృథా ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులతో నిండి ఈగ, దోమలకు నిలయంగా మారింది. ఓ పక్క దుర్వాసన, మరోపక్క దోమల బాధతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా క్యాంటీన్ మూతబడటంతో టిఫిన్స్, భోజనానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కనీసం తాగునీటి వసతి సైతం కల్పించకపోవడంతో ఆర్టీసీ అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


