ఎస్సీ, ఎస్టీ చట్టంపై అవగాహన అవసరం
వనపర్తి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని, ఏవైనా సమస్యలుంటే వారు ప్రజావాణిలో కూడా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావుతో కలిసి ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతినెల చివరి వారంలో మండలాల్లో నిర్వహించే సివిల్ రైట్స్ డేలో పాల్గొనాలన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలు చదువుకు దూరం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆయా వర్గాలపై దాడులు జరిగితే సకాలంలో న్యాయం జరిగేలా, పరిహారం అందేలా చూడాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సభ్యులకు సూచించారు. అంటరానితనం ప్రదర్శించడం, దాడులు చేస్తే పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయాలన్నారు. హక్కులు చట్టాలపై ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ అధికారి మల్లికార్జున్, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బోజరాజు, వీరప్ప, విశ్వంబాబు, వెంకటేష్, వెంకటేష్ గౌడ్, ఖమర్ పాల్గొన్నారు.


