బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
గోపాల్‌పేట: బాలల హక్కులు పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన గ్రామ కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని.. ఆడపిల్లకు 18 ఏళ్లు, మగ పిల్లాడికి 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చేయడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు గృహహింస పెరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే 14 ఏళ్లలోపు చిన్నారులను పాఠశాలలకు పంపించాలని చెప్పారు. మధ్యలో చదువు మానిన విద్యార్థులను గుర్తిస్తే వెంటనే పాఠశాలలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అయేషా అంజన్, బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ లక్ష్మమ్మ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఈదమ్మ, రాందేవ్‌రెడ్డి, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.


