అమరచింత: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో గురువారం చేనేత సంబురాలు నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య తెలిపారు. కలెక్టరేట్ నుంచి చేనేత కార్మికులతో ర్యాలీ ఉంటుందని.. జిల్లాలోని నేత కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే చేనేతలో రాణిస్తున్న సీనియర్ కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం ఉంటుందన్నారు. విద్యార్థులకు చేనేతపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని చెప్పారు.
రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,080 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 646 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 65 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 569 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకం కావాలి : సీపీఎం
మదనాపురం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విధ్వేషాలతో రెచ్చిపోతోందని.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్ ఆవరణలో నిర్వహించిన మండలశాఖ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. అనేక రాష్ట్రాల్లో ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు పాల్పడుతూ సంబరపడుతున్నారని.. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రజాభివృద్ధిని భ్రష్టు పట్టిస్తున్నారని వెల్లడించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో సీపీఎం శాఖ సమావేశాలు ఏర్పాటు చేసుకొని బలోపేతం కావాలన్నారు. అంతకుముందు అమరులకు సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మండ్ల రాజు, మండల కార్యదర్శి వెంకట్రాములు, అజ్జకొల్లు గ్రామ కార్యదర్శి మనివర్ధన్, నాయకులు బడికి విష్ణుప్రసాద్, చిరంజీవి, చెన్నయ్య, వెంకటేష్, మొగిలి, ఆంజనేయులు, మాసన్న. వెంకటన్న సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘ఎస్సీ, ఎస్టీ టీచర్లకు న్యాయం చేయాలి’
వనపర్తిటౌన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అన్ని క్యాడర్లలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కంటే నిరంజనయ్య కోరారు. బుధవారం డీఈఓ అబ్దుల్ ఘనీని కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా అమలవుతున్న గ్రూప్ 1, 2, 3లకు అడక్వేసి వర్తించదని, కొత్త జీఓ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. అదేవిధంగా బ్యాక్‌లాగ్ ఎస్సీ, ఎస్టీ పోస్టుల వివరాలు, గతంలో అన్ని సబ్జెక్టుల్లో ఏ రోస్టర్ వరకు పదోన్నతులు కల్పించారో ఆ వివరాలు సైతం వెల్లడించాలని పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బి.వెంకటయ్య, గగనం సీనయ్య, బౌద్దారెడ్డి, సూర చంద్రశేఖర్, మహిపాల్‌రెడ్డి, హమీద్, డి.కృష్ణయ్య, సుధాకర్ ఆచారి, కృష్ణయ్య, విష్ణువర్ధన్, అమరేందర్, బాలరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమావేశం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నేడు (గురువారం) స్థానిక తెలంగాణ చౌరస్తాలోని రెడ్‌క్రాస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎ.రాజసింహుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపుదల, నూతన కార్యవర్గం ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకం కావాలి