
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
అమరచింత: విద్యార్థినులకు ఇబ్బందులు కలిగితే సహించమని.. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి ఉన్నతాధికారులకు విన్నవించాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి అఫ్జలుద్దీన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని కేజీబీవీని జీసీడీఓ శుభలక్ష్మితో కలిసి తనిఖీ చేసి విద్యార్థినులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 15 మరుగుదొడ్లకుగాను కేవలం 3 మాత్రమే వినియోగంలో ఉన్నాయని, తాగునీటి సమస్య ఉందని, రాత్రిళ్లు విషపు పురుగులు సంచరిస్తున్నాయని విద్యార్థినులు అధికారులకు వివరించారు. మరుగుదొడ్ల సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఎస్‌ఓను ప్రశ్నించగా.. విషయాన్ని జిల్లా అధికారులకు విన్నవించామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరించాలని జీసీడీఓకు సూచించారు. అదేవిధంగా రోజువారీగా అందించే ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ విధిగా పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలోని వంట గదిని పరిశీలించి ఎప్పడూ శుభ్రంగా ఉంచాలని, వంట కార్మికులు శుచి, శుభ్రత పాటించాలన్నారు. విద్యార్థినులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన అందించాలని కోరారు. అనంతరం పాంరెడ్డిపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి, ఎంఈఓ భాస్కర్‌సింగ్, ఎంపీఓ నర్సింహులు ఉన్నారు.