● అన్ని రంగాల్లో విజయనగరం అభివృద్ధే మా అభిమతం
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, అన్ని రంగాల్లో విజయనగరం అభివృద్ధే తమ అభిమతమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన 16 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజా సంక్షేమం, నగర అభివృద్ధి కోసం ప్రశ్నించేందుకు, ప్రజల పక్షాన నిలిచేందుకు కోలగట్ల కుటుంబం, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటాయన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అవసరమైన పోరాటానికి సిద్ధపడతామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విజయనగరం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమావేశంలో మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, మాజీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీర వెంకట రాజేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, తదితరులు పాల్గొన్నారు.


