● వేలాది మంది లబ్ధిదారుల ఎదురుచూపు
● జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు
విజయనగరం ఫోర్ట్: సీ్త్ర, శిశు సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుంది. కానీ అది అమలులో మాత్రం కానరావడం లేదు. గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం కూడా సకాలంలో అందించలేని దుస్థితిలో టీడీపీ సర్కార్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం కోసం గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు. ప్రతినెల ఐదో తేదీలోగా గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని కిట్లు (పౌష్టికాహారం కిట్లు) అందిస్తారు. అయితే ఈనెల 24వతేదీ వచ్చినా టీడీపీ సర్కార్ ఇంతవరకు వాటిని ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టులు
జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు, 292 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, 2,207 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో గర్భిణులు, బాలింతలు 14,568 మంది ఉన్నారు.
అందని బాలసంజీవిని కిట్లు
ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు బాలసంజీవని(పౌష్టికాహారంతోకూడిన) కిట్లు అందిస్తారు. ప్రతి లబ్ధిదారుకు అటుకలు కేజీ, చోడిపిండి 2 కేజీలు, బెల్లం పావు కేజీ, చెక్కీలు 250 గ్రాములు, ఎండు కర్జూరం 250 గ్రామలతో కూడిన బాలసంజీవని కిట్టు అందిస్తారు. అయితే ఈరోజు వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందాల్సిన బాలసంజీవని కిట్లు అందకపోవడంతో గర్బిణులు, బాలింతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాంట్రాక్ట్ ఖరారు కావడం లేటు
గర్భిణులు, బాలింతలకు అందించే బాలసంజీవని కిట్లు ఇంతవరకు కేంద్రాలకు రాలేదు. బాలసంజీవని కిట్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఖరారు కావడం ఆలస్యం అవడంతో ఈనెల పంపిణీ ఆలస్యమైంది. కిట్లు వచ్చిన వెంటనే కేంద్రాలకు సరఫరా చేయనున్నాం.
కేవీ బాలమణి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిణి


