కరెంటుకే షాక్‌..! | - | Sakshi
Sakshi News home page

కరెంటుకే షాక్‌..!

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

విజయనగరం: ఎల్‌నినో దెబ్బకు వర్షాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉండగా తీవ్రమైన వేడిమితో జిల్లా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షా కాలంలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. పల్లెలు, పట్టణాల్లో ఒకే మాదిరిగా విద్యుత్తును వినియోగిస్తుండడంతో మీటర్లు రయ్‌ రయ్‌మంటూ పరుగు పెడుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో విజయనగరం టౌన్‌, విజయనగరం రూరల్‌, బొబ్బిలి డివిజన్‌ల పరిధిలో మరో 9 సబ్‌ డివిజన్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 98 సబ్‌ స్టేషన్‌లు ఉండగా..24,428 డీటీఆర్‌ (డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు, 8,640 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వాటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా 7,19,165 సర్వీసులకు ప్రతిరోజు విద్యుత్‌సరఫరా చేస్తుండగా..వాటిలో గృహావసర విద్యుత్‌సర్వీసులు 6,00,828, వాణిజ్య సర్వీసులు 64,361, పారిశ్రామిక సర్వీసులు 2432, వివిధ రకాల ఇనిస్టిట్యూషన్‌ సర్వీసులు 15,332, వ్యవసాయాధారిత సర్వీసులు మరో 36,215 సర్వీసులు ఉన్నాయి. వాటిలో వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు పగటి వేళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు, ఇతర సర్వీసులకు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

అప్రకటిత కోతలు..

వాస్తవానికి జూలై నెల వచ్చిందంటే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుంది. అయితే ఈఏడాది ఎల్‌నినో ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులను ప్రజలు అనుభవిస్తున్నారు. వర్షాలు పూర్తిగా లేకపోవడం..ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా వేసవి తరహాలో వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలో విద్యుత్తు డిమాండ్‌ పెరగడంతో అప్రకటిత కోతలు మొదలు పెట్టారు. పల్లెలు, పట్టణాల్లో గంటల కొద్దీ మరమ్మతుల పేరిట కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. మరో పక్కన లోడు అధికమై విద్యుత్తు నియంత్రికలు మొరాయిస్తూ కాలిపోతున్నాయి. మార్చి మూడవ వారం వరకు జిల్లాలో సగటు వినియోగం 9 ఎంయూ (90 లక్షల యూనిట్లు) ఉండగా..గడిచిన మూడు రోజుల్లో 50 లక్షల యూనిట్లు పెరుగుదలను నమోదు చేసుకుని 9.5 ఎంయూ వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మే, జూన్‌ నెలల్లో మరో 50 లక్షల యూనిట్లు పెరిగి మొత్తంగా 10 ఎంయూ పైగా పెరిగింది. తాజాగా జూలై నెలలో గతేడాది 9 ఎంయూ విద్యుత్‌ను సరాసరిన వినియోగదారులు వినియోగించగా .. ప్రస్తుత 2026లో 10 నుంచి 11 ఎంయూ వరకు పెరగడం గమనార్హం.

నిరంతరాయ సరఫరాకు చర్యలు

ఈ ఏడాది వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్‌ వినియోగం పెరిగింది. వర్షాలు లేకపోవడంతో ఉక్కపోత ఎక్కువైంది. దీంతో వినియోగదారులు ఏసీలు, కూలర్‌లు, ఫ్యాన్‌లు వినియోగిస్తున్నారు. దీంతో ప్రసుతం 10లక్షల 80వేల యూనిట్లు విద్యుత్‌ వినియోగిస్తున్నారు. వినియోగదారులకు అవసరమైన సరఫరాను చేస్తున్నాం. చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించి సరఫరాను పునరుద్దరిస్తున్నాం.

– మువ్వల లక్ష్మణరావు, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్‌, విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌

జోరుతగ్గని విద్యుత్‌ వినియోగం

వేసవిలో మాదిరి తిరుగుతున్న విద్యుత్‌ మీటర్‌

ఎల్‌నినో ప్రభావంతో కురవని

వర్షాలు..ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

గతేడాదితో పోల్చుకుంటే జూలై నెలలో పెరిగిన విద్యుత్‌ వినియోగం

ఆగని ఏసీలు, కూలర్‌, ఫ్రిజ్‌ల వినియోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement