వెల్లువెత్తిన వినతులు | - | Sakshi
Sakshi News home page

వెల్లువెత్తిన వినతులు

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

వెల్లువెత్తిన వినతులు

పేరుకుపోతున్న పెండింగ్‌ కేసులు

అర్జీదారులకు తప్పని నిరీక్షణ!

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ పరిధిలోని భూ వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. ప్రతి వారం నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలకు వినతులు వరదలా వస్తుండడమే అందుకు నిదర్శనం. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఒక్క రోజే ఏకంగా 199 వినతులు నమోదు కా వడం అధికారుల తీరుపై విమర్శలకు తావిస్తోంది.

రెవెన్యూ శాఖలోనే అత్యధిక సమస్యలు:

నమోదైన మొత్తం వినతుల్లో ఒక్క రెవెన్యూ శాఖకు సంబంధించే 97 అర్జీలు రావడం గమనార్హం. భూ వివాదాలు, సర్వే సమస్యలను క్షేత్రస్థాయి అధికారులు సకాలంలో పరిష్కరించకపోవవడం వల్లే ప్రజలు కలెక్టరేట్‌ చుట్టూ తిరగాల్సి వస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీజీఆర్‌ఎస్‌ పోర్టల్‌ను నిరంతరం పరిశీలించాలని పెండింగ్‌ అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌.సత్తిబాబు ఆదేశించినప్పటికీ, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అర్జీదారులతో నేరుగా మాట్లాడకుండానే ఎండార్స్‌మెంట్లు ఇస్తున్న తీరుపై కూడా ఈ సందర్భంగా డీఆర్‌ఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. 1100 టోల్‌ ఫ్రీ సేవలు, శాఖల వారీగా నమోదవుతున్న ఫిర్యాదులపై అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం సడలే ప్రమాదం ఉంది. ప్రతి అర్జీదారుతో నేరుగా సంప్రదించిన తర్వాతే నివేదికలు/ఎండార్స్‌మెంట్లు ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయం వివరాలను తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలని డీఆర్‌ఓ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు కళావతి, అరుణకుమారి, కలెక్టరేట్‌ ఏఓ దేవ్‌ప్రసాద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 34 ఫిర్యాదులు

విజయనగరం క్రైమ్‌: స్థానిక డీపీఓలోని డీసీఆర్బీ సెక్షన్‌లో డీసీఆర్బీ సీఐ కుమార స్వామి ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 34 ఫిర్యాదులను సీఐ స్వీకరించారు. వాటిలో భూతగాదాలకు సంబంధించి 9, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాల గురించి 9, ఇతర అంశాలకు సంబంధించి 11 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో గాజులరేగకు చెందిన ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని సీఐ స్వామికి ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో ఎస్సైలు ప్రభావతి, పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement