అపరాలకు నష్టం
కంటిపాపలా కాపాడుకున్నా..
అకాలవర్షం..
గజపతినగరం రూరల్/బాడంగి/సంతకవిటి:
జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అపరాలు, మొక్కజొన్న పంటలకు అపార నష్టం కలిగించింది. ఈదురుగాలుతోకూడిన వర్షానికి పలు గ్రామాల్లోని మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అపరాల పంటలను వర్షంనీరు ముంచెత్తింది. పంట పొలాల్లో ఉన్న చేనును కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు.
●సుమారు అరగంట సమయంపాటు కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి గజపతినగరంలోని 26వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలు నేలకూలాయి. ఆ సమయంలో ఎవ రూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాసేపు మెంటాడ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మెంటాడ రోడ్డు లోతట్టు ప్రాంతం కావడంతో జాతీ య రహదారి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు రోడ్డుపై వర్షంనీరు పోటెత్తింది.
●బాడంగి మండలంలోని కోడూరు గ్రామంలో అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులతో స్వీట్ కార్న్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన పలువురు రైతులు సాగుచేసిన స్వీట్ కార్న్ పంట నేలమట్టమైంది. మరోవారం రోజుల్లో కోతకు వచ్చే దశలో ఈదురు గాలులు పంటను నాశనం చేశాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవ సాయాధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
●సంతకవిటి మండలంలోని సంతకవిటి, మందరాడ, చింతలపేట, గరికిపాడు, అక్కరాపల్లి, కాకరాపల్లి, తాలాడ, ఎమ్.ఆర్.అగ్రహారం, పోతులజగ్గుపేట, గోళ్లవలస, తదితర గ్రామాల్లో కురిసిన వర్షా నికి పొలాల్లో తీసిన అపరాలు పంటలు తడిసిపో యాయి. కొన్నిచోట్ల టార్పాలిన్లతో రైతులు పంట ను రక్షించారు. ఇటుక పరిశ్రమ నిర్వాహకులకు సైతం అకాలవర్షం నష్టం తెచ్చింది.
నాకున్న అర ఎకరం పొలంలో స్వీట్ కార్న్ సాగు చేశాను. కంటిపాపలా కాపాడుకున్న పంట, కోతకు వచ్చే సమయంలో ఇలా నేలపాలవ్వడం తట్టుకోలేకపోతున్నాం. దయచేసి వ్యవసాయ శాఖ అధికారులు పొలాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలి. ప్రభుత్వం కనికరించి మాకు నష్టపరిహారం అందించాలి. – కొల్లి సత్యం, రైతు, కోడూరు గ్రామం
అపరాలకు నష్టం


