ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
● ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు ● నేడు విజేతలకు బహుమతుల ప్రదానం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం వేదికగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. నగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 148 మంది పారా క్రీడాకారులు పాల్గొనగా.. పోటీలను రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆర్థో, వీల్‌చైర్ కేటగిరీ క్రీడాకారులకు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా... క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు శాయశక్తులా కృషి చేశారు. రెండురోజుల పాటు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు గురువారం బహుమతులు ప్రదానం చేయనుండగా... ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల ను మార్చి 6 నుంచి 10వ తేదీవరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగనున్న జాతీయస్థాయి పారా బాడ్మింటన్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక చేస్తామని పారా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. పోటీలను ప్రారంభించిన రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పరిశీలకులుగా స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ప్రతినిధి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పోటీలను వివిధ జిల్లాలకు చెందిన పారా క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పర్యవేక్షించారు.


