టమోటా ధరలు ఢమాల్
నెలరోజుల కిందట కిలో రూ.50,
నేడు రూ.5
బొబ్బిలి:
నెలరోజుల కిందట కిలోకు రూ.50ల పైనే పలికిన టమోటా ధరలు నేడు రూ.5కి పడిపోయాయి. పండగ సీజన్ ఉన్నంత వరకూ ఆకాశంలో ఉన్న టమోటా ధరలు పెళ్లిళ్ల సీజన్ సమీపించిన తరుణంలో ధరలు తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నా రు. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతులతో పాటు ఉత్తరాంధ్ర నుంచి ఎగుమతి చేసుకునే ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా టమోటా ఉత్పత్తులు పెరగడంతో అన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతులకు అవకాశం లేక ధరలు నేలచూపులు చూస్తున్నాయని పేర్కొంటున్నారు. రైతు వద్ద కిలోకు రూ.5కు కొనుగోలు చేసిన వ్యాపారులు వినియోగదారులకు రూ. 10కి విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రాఫ్ట్ పద్ధతిలో 80 ఎకరాల్లోను, సాధారణ సాగులో 300 ఎకరాల్లో టమోటా సాగవుతోంది. సాధారణ సాగులో హెక్టారుకు 25 నుంచి 30 టన్నులు, గ్రాఫ్ట్ పద్ధతిలో 50 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. బొబ్బిలి, రామభద్రపురం, రాజాం, చీపురుపల్లి, ఎస్.కోట, విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లో టమోటా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


