అంబటి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ
నెల్లిమర్ల రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు కుటుంబాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు శుక్రవారం పరామర్శించారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, సహచర ఎమ్మెల్సీలతో కలిసి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ అంబటి నివాసంపై టీడీపీ శ్రేణుల దాడి అత్యంత బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఏదైనా తప్పు జరిగితే చట్టాలు, న్యాయస్థానాల ద్వారా తేల్చుకోవాలే తప్ప భౌతిక దాడులకు దిగడం ఏ మాత్రం సరికాదన్నారు. కుటుంబ సభ్యులు ఉంటుండగానే అంబటి నివాసంపై దాడి చేశారని, కార్లు సైతం ధ్వంసం చేశారన్నారు. ఇది ముమ్మూటికీ అత్యాచార ప్రయత్నమేనని, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


