21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
విజయనగరం: తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్త అగ్రహారంలో గల గీతాంజలి విద్యాసంస్థల ప్రాంగణంలో వేడుకలు నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో భాగంగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థినులు దేశభక్తిని ప్రబోధించే విధంగా సాంస్కృతిక ప్రదర్శన ఇస్తారన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు మండా రమేష్‌తో దుర్యోధన ఏకపాత్రాభినయం ఉంటుందని అన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తెలుగు భాష విశిష్టత అనే అంశంపై వక్తృత్వ పోటీల్లో పాల్గొంటారని, పలు నృత్య ప్రదర్శనలతో పాటు ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ గాయకులు ఉమామహేశ్వరి, కూర్మారావు, సూర్యప్రకాష్‌లతో సినీ సంగీత విభావరి కూడా ఏర్పాటు చేశామని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత పి రాజేశ్వరరావుతో చిత్రకళా ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉత్తరాంధ్ర విభాగం మహిళా శాఖ అధ్యక్షురాలు పలుకూరి ప్రభావతి, సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్ ఎ.శ్రీనివాసరావు, సమైక్య భారతి కార్యదర్శి ధవళ సర్వేశ్వరరావు,ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి ముళ్లపూడి సుభద్రాదేవి, ప్రముఖ న్యాయవాది దాసరి పద్మ, గురజాడ మునిమనుమడు వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవ ఆహ్వానపత్రికల ఆవిష్కరణ


