శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
నెల్లిమర్ల రూరల్: రామతీర్థంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి అని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులకు సూచించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు సుమారు లక్ష మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులను వేరే ప్రాంతంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కోనేరు, బాత్ ఘాట్స్, కేశఖండన శాల, నీలాచలం పర్వతంపై బందోబస్తు నిర్వహించాలన్నారు. ఈవ్‌టీజింగ్, దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీతారామునిపేట, దన్నానపేట రహదారిలో వాహనాలు నిలుపుదల కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ గణేష్, ఈఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీ: ఇద్దరికి గాయాలు
వంగర: మండల పరిధి రుషింగి వద్ద రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గురువారం రుషింగి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మండలంలోని లక్ష్మీపేట గ్రామానికి చెందిన కలమట వెంకటేష్ కుడిచేయి విరిగింది. వీరఘట్టం మండలం చిట్టిపూడివలస గ్రామానికి చెందిన ఏడాకుల వంశీకి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ గణపతి తెలిపారు.
80 లీటర్ల సారా పట్టివేత
కొమరాడ: మండల కేంద్రం కొమరాడ గ్రామంలోని కొత్త కాలనీకి చెందిన గొర్లి సత్యనారాయణ 80 లీటర్ల సారాతో పట్టుబడినట్లు ఎస్‌ఐ జగదీష్‌నాయుడు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారాతో పాటు ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని సత్యనారాయణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి
శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి


