విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా
● స్కూల్‌బస్సు ప్రమాదంపై అధికారుల పరిశీలన
బొబ్బిలిరూరల్: మండలంలోని అలజంగి వద్ద బుధవారం పాఠశాల బస్సు బోల్తాపడిన సంఘటనలో గాయపడి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా అధికారులు గురువారం పరామర్శించారు. ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఈఓ మల్లికార్జునరావు తదితరులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించారు. నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. గాయపడిన విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఎంవీఐ శశికుమార్‌తో కలిసి పరిశీలించారు. బస్సుకు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని ఎంవీఐ తెలియజేశారు. అక్కడి నుంచి కారాడ గ్రామం వద్ద ఉన్న సన్‌షైన్ హోం ఆశ్రమాన్ని అధికారులు పరిశీలించారు.విద్యార్థులకు అందుతున్న వసతులు,ఆహారం వంటి అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపులు, గుడ్ బ్యాడ్‌టచ్‌లపై వివరించారు. పోక్సో చట్టంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సమస్యలేమైనా ఉంటే తెలియజేయాలని కోరారు. హోంలో మొత్తం 118 విద్యార్థులు ఉండగా వారిలో ఆరు నుంచి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 66 మంది విద్యార్థినులు, ఎల్‌కేజీ నుంచి ఏడోతరగతి వరకు చదువుతున్న 52 మంది విద్యార్థులు ఇక్కడి వసతిగృహంలో చదువుకుంటున్నట్లు మేనేజర్ రాజవర్మ వివరించారు. హోంలో బాత్‌రూంలు, బెడ్‌రూంలను అధికారులు పరిశీలించారు. శుభ్రమైన ఆహారం అందించాలని, బాలికల అనారోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యసిబ్బందితో పరీక్షలు జరిపించి చికిత్స అందించాలని నిర్వాహకుడు రాజవర్మకు సూచించారు. ఆహారపదార్థాలను రుచిచూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీపీఓ బీహెచ్ లక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి, పీఓఐసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


