ఉద్యోగ మేళాకు స్పందన
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్‌టీయూ–జీవీ ప్రాంగణంలో జేఎన్‌టీయూ–జీవీ, హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ్–ఇన్ఫోసిస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లబించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్‌టీయూ జీవీ ఉపకులపతి వీవీ సుబ్బారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ మేళాకు హాజరైన నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు (ఏఐ) వ్యాపిస్తున్న ప్రస్తుత కాలంలో ఇటువంటి ఉద్యోగ మేళాను నిర్వహించడంతో సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలను సాధించాలని సూచించారు. ఉద్యోగాలు సాధించిన వారు సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నారు. ఉద్యోగం ఎక్కడైనా వెళ్లి చేయడానికి సిద్ధం కావాలన్నారు. ఈ ఉద్యోగ మేళాకు రాయల్ ఎన్‌ఫీల్డ్, మేధా, టాటా ఎలక్ట్రానిక్స్, కియా, వోల్టాస్, హుండయ్, యోకోహామా సంస్థలు ముందుకురాగా వివిధ ప్రాంతాల నుంచి 632 మందికి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 497 మంది హాజరయ్యారు. వారిలో నుంచి 301 మందికి ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఉపకులపతి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిర్మాణ్– ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధి జి.శ్రీనివాసరావు, జేఎన్‌టీయూ జీవీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, సమన్వయకర్తలు జీజే నాగరాజు, వి.ఎస్.వకుళ, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ మేళాకు స్పందన


