రామతీర్ధంలో ఏర్పాట్ల పరిశీలన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. రామతీర్థంలోని శ్రీసీతారామ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, భక్తుల క్యూలను పర్యవేక్షించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శివరాత్రికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. తాగునీరు, నీడ, పారిశుధ్యం, పార్కింగ్, భద్రతా పరమైన అంశాల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శివాలయాన్ని కూడా సందర్శించి క్యూలు పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో డి. కీర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష, ఆలయ ఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్, స్థానిక ఎంపీడీఓ కె.రామకృష్ణరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


