సర్వజన ఆస్పత్రిలో గుర్తు తెలియని రోగి మృతి
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి క్యాజువాలిటీ వద్ద 45 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే రణస్థలానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బుధవారం స్పృహ తప్పిపడిపోయి ఉండడంతో వన్‌టౌన్ పోలీసులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత ఏమైందో ఏమో కాని ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదురుగా శవమై కనిపించాడు. నన్ను బతికించిండి, బతికించిండని సదరు రోగి అర్తనాదాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి అనాథ కావడంతో ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం వల్ల అనాథ గానే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇదేవిషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా ఒక అనాథ వ్యక్తిని ఆస్పత్రిలో పోలీసులు చేర్పించినట్లు, ఆ వ్యక్తికి చికిత్స అందించినట్లు క్యాజువాలిటీ వైద్యులు తెలిపారన్నారు. మృతికి గల కారణాలు తెలుసుకుంటామని చెప్పారు.


