రాముడికీ తప్పని ఆక్రమణల బెడద..!
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి గణనీయమైన చరిత్ర ఉంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో రామక్షేత్రానికి విచ్చేసి శ్రీ సీతారామస్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఆలయానికి సుదీర్ఘ చరిత్ర కూడా ఉండడంతో ఏటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆలయానికి వెళ్లేందుకు సరైన మార్గం లేక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దేవస్థానానికి వెళ్లే మార్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆక్రమణలు విపిరీతంగా పెరిగిపోయాయి. స్థానిక కూటమి నాయకుల ప్రోత్సాహంతో స్వామి ఆలయానికి వెళ్లే రహదారి సైతం ఆక్రమణకు గురి కావడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య అంతంత మాత్రమే కావడంతో సమస్య కనిపించకపోయినప్పటికీ ఉత్సవాల వేళ స్వామి దర్శనానికి సగటు భక్తుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. ముఖ్యంగా తూర్పు రాజగోపురం ఎదుట ఉన్న ప్రధాన రహదారిని మాడ వీధులుగా మారిస్తేనే ఇబ్బందులు తప్పుతాయనేది భక్తుల అభిప్రాయం.
శివరాత్రికి హాజరుకానున్న లక్షలాది మంది భక్తులు
రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఏటా రెండు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయానికి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండడంతో ప్రతి ఏటా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు అదే ప్రాంతంలో విచ్చలవిడిగా షాపులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ షాపులు కాలక్రమేణా రహదారిపైకి విస్తరించడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ఉత్సవాల నేపథ్యంలో ముందస్తు చర్యలు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పలుచోట్ల తోపులాటలు జరిగి భక్తులు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఎదురైంది. ప్రమాదం జరగక ముందే మేల్కొంటే మంచిదనే అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అనుకోని ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేది భక్తుల వాదన. శివరాత్రికే కాకుండా ప్రతి ఏటా జరిగే రథయాత్రకు కూడా నానా అవస్థలు పడాల్సి వస్తోంది. రోడ్డుపైకి షాపులు ఉండడంతో రథం అత్యంత కష్టంగా తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల జరిగిన రథయాత్ర ఉత్సవంలో కూడా ఇదే సమస్య తలెత్తింది.
ఆక్రమణల తొలగింపు ఉన్నతస్థాయిలోనే..
రామ దేవస్థానం చుట్టూ ఉన్న షాపులన్నీ ప్రస్తుతం పంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఈ నెల 15 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ ఎంపీడీఓ శంకర జగన్నాథం, సిబ్బంది ఇటీవల పర్యటించి ఆక్రమణలో ఉన్న షాపులకు కొలతలు వేసి స్థలాన్ని నిర్ణయించేందుకు ప్రయత్నించారు. సమీపంలోని ఇళ్లల్లో నివసిస్తున్న కొంతమంది తమ వద్ద ఉన్న రిజిస్టర్ డాక్యూమెంట్లను చూపించడంతో ఆక్రమణల తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా వారు చూపిస్తున్న డాక్యుమెంట్లు తప్పులతడకగా ఉన్నాయని, డాక్యుమెంట్ల ప్రకారమైతే రాముడి ఆలయానికి చేరుకునేందుకు రోడ్డు కూడా ఉండదనేది అధికారులు చెబుతున్న మాట. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులే రంగంలోకి దిగితే సమస్య పరిష్కారమవుతుందనే అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించి మాడ వీధులుగా మారిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించాలని కోరుతున్నారు.
ఇరుకుగా మారిన దేవాలయానికి వెళ్లే రహదారి
ఉత్సవాల వేళ భక్తులకు తప్పని అవస్థలు
సమీపిస్తున్న శివరాత్రి ఉత్సవాలు,
కనిపించని ముందస్తు చర్యలు
రాముడికీ తప్పని ఆక్రమణల బెడద..!


