సమాజంలో మార్పులకు అనుగుణంగా పోలీస్ ఉద్యోగం
● కానిస్టేబుళ్ల ట్రైనింగ్ పరిశీలనలో ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు ఉద్యోగం మారుతుందని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు నగర శివారు సారిపల్లిలో గల జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. డీపీటీసీలో జరుగుతున్న శిక్షణను ఏఎస్పీతో కలిసి ఎస్పీ బుధవారం పరిశీలించారు. కేంద్రంలో జరుగుతున్న శిక్షణను దర్గరుండి పర్యవేక్షించారు. శిక్షణార్థుల వసతి గదులను, తరగతి గదులను పరిశీలించారు. శిక్షణలో ఇన్ డోర్, ఔట్ డోర్ తరగతుల నిర్వహణ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని వారికి కొన్ని సూచనలు చేశారు. శిక్షణార్థులతో కలిసి ఎస్పీ భోజనం చేశారు. సమాజంలో మార్పులకు అనుగుణంగా పోలీసింగ్ మారుతుందని, బేసిక్ పోలీసింగ్‌తో పాటు కొత్తగా వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకు సాగాలని ఎస్పీ సూచించారు. అందరితో కలిసి భిన్న వాతావరణం, విభిన్నమైన ప్రాంతాల్లో శిక్షణ పొందడం వల్ల ఎవరితో ఏవిధంగా మెలగాలో తెలియడంతో పాటు, ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా మెరుగవుతారన్నారు. కార్యక్రమంలో డీపీటీసీ డీఎస్పీ పి.నారాయణరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సీఐలు, ఆర్‌ఐ టి. శ్రీనివాసరావు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, శిక్షణ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
ఫైరింగ్ చేసేటప్పుడు లక్ష్యం గురి తప్పకూడదు
ఫైరింగ్ చేసేటప్పుడు లక్ష్యం గురి తప్పకూడదని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ను సారిపల్లి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, అధికారుల ఫైరింగ్ ప్రాక్టీసును పర్యవేక్షించి, ఫైరింగ్ ప్రాక్టీసులో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.


