కేసుల పరిష్కారంలో వేగం.. శాంతిభద్రతలకు ప్రాధాన్యం
● అపరిష్కృత ఫైళ్లపై ఎస్పీ మాధవ్‌రెడ్డి సమీక్ష
పార్వతీపురం రూరల్: నేరాల నియంత్రణలో వేగం..దర్యాప్తులో సాంకేతికత తోడైనప్పుడే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మాసాంతపు నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘దర్యాప్తులో నైపుణ్యం–నేరస్థులకు శిక్షే లక్ష్యం’గా పని చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, గడువులోగా చార్జ్ షీట్లు దాఖలు చేసి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో ఏమాత్రం అలసత్వం వహించకుండా, శాసీ్త్రయ పద్ధతుల్లో ఆధారాలు సేకరించాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని, గ్రామస్థాయిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్‌తో పాటు రాత్రి గస్తీని ముమ్మరం చేయాలన్నారు. విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


