ప్రతీ నెల శాప్ లీగ్ టోర్నమెంట్
● 17న చెస్, 24న సైక్లింగ్ క్రీడాకారుల ఎంపిక
● జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు
విజయనగరం: ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా స్పార్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో ప్రతినెలా వివిధ క్రీడాంశాల్లో లీగ్ టోర్నమెంట్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 31 క్రీడాంశాలకు సంబంధించి జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ రూపొందించిన క్రీడా యాప్‌లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. యాప్‌లో వివరాలు నమోదు చేసుకోని క్రీడాకారులను పోటీలకు అనుమతించమని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి నెలలో లాన్ టెన్నిస్, సెప్టెంబర్‌లో వాలీబాల్ క్రీడాంశాల్లో జిల్లా వేదికగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈనెలలో తిరుపతిలో జరగనున్న చెస్ పోటీలకు సంబంధించి 17న రాజీవ్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 విభాగాల్లో బాలబాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాలో జరగబోయే ఓపెన్ లెవెల్ సైక్లింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈనెల 24న విజ్జి స్టేడియంలో నిర్వహించనున్నామన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల క్రీడాకారులు రెండు రోజులు ముందుగానే క్రీడా యాప్‌లో తమ వివరాలను పొందుపరుచుకోవాలని సూచించారు. జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్, ఆయా క్రీడా సంఘాల సమన్వయంతో ఈ పోటీలు నిర్వహిస్తామని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు సదుపాయాలు కల్పించడంతో పాటు క్రీడాదుస్తులు అందజేయనున్నట్లు చెప్పారు.


