సెంచూరియన్‌లో ఉత్కళ కృషి మేళా
పర్లాకిమిడి: వికసిత్ భారత్, వికసిత్ ఒడిశా లక్ష్యంగా సెంచూరియన్ వర్సిటీలో చదివే వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్ విద్యార్థులు చక్కటి ప్రణాళికతో పది మందికీ ఉపాధి కల్పించేలా ఎదగాలని రాష్ట్ర మత్స్య, సూక్ష, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ గోకులానంద మల్లిక్ ఆకాంక్షించారు. ఆయన ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో బుధవారం మధ్యాహ్నం నాల్గో ఉత్కళ కృషి మేళా–2026ను ప్రారంభించారు. ఆయనతో పాటు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతి రావు, ఉపకులపతి ప్రొఫెసర్ సుప్రియా పట్నాయిక్, ప్రొఫెసర్ వీసీ అజయ్ కుమార్ నాయక్, ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, రిజిస్ట్రార్ అనితా పాత్రో, ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ విద్యాలయం డీన్ ఎస్‌పీ నందా, తదితరులు పాల్గొన్నారు. మంత్రి గోకులా నంద నాయక్ సెంచూరియన్ వర్సిటీ ఆవరణలో పూలతోట ప్రదర్శన, మేకలు, కోళ్ల స్లాటర్ హౌస్‌ను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి గోకులానంద మల్లిక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కామధేను యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకంలో ఒక లక్షా 30 వేల వరకూ సబ్సిడీలు అందజేస్తున్నామని అన్నారు. గజపతి జిల్లాలో పాడి రైతులు 634 మంది దరఖాస్తు చేసుకోగా 312 మంది రైతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. రైతులు కేవలం వరి పంట వేసి వేసవిలో సేద తీర్చు కోకుండా వనరాజా కోళ్లు, రొయ్యల చెరువులు నిర్మించాలని జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు అన్నారు. కార్యక్రమంలో కోర్సండ గ్రామానికి చెందిన చేపల పెంపకంలో అధిక లాభాలు పొందిన జి.కల్పనకు, రైతు చిన్నయ్యకు మంత్రి గోకులనంద మల్లిక్ చేతులమీదుగా మెమొంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ డీన్ ప్రొఫెసర్ ఆర్‌కే స్వయిని, డీన్ ఫిషరీస్ గిరీష్ మహంతి, విజయనగరం సెంచూరియన్ కళాశాల డీన్ జోన్నలగడ్డ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


